తమిళనాడు నుంచే పీఎం.. సౌత్ కలిస్తే ప్రధాని మనమే
దేశ రాజకీయాల్లో మళ్లీ 'ఉత్తరాది వర్సెస్ దక్షిణాది' సెగలు తీవ్రస్థాయికి చేరాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయంపై తమిళనాడు శాసనసభలో ప్రకంపనలు సృష్టించాయి. జనాభా ప్రాతిపదికన స్థానాలు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతాయని, కేవలం 5 లేదా 6 ఉత్తరాది రాష్ట్రాలు మాత్రమే దేశ ప్రధాని ఎవరు కావాలో తీర్మానించే దుస్థితి రాకూడదని తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున్ అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో దక్షిణాది నుంచి, ముఖ్యంగా తమిళనాడు నేల నుంచే దేశ ప్రధాని రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
నియోజకవర్గాల విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడిన మంత్రి ఆధవ్ అర్జున్, ఇది కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ పోరు కాదని, తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడుకునే హక్కుల పోరాటమని స్పష్టం చేశారు. "ప్రస్తుతం 234 మంది ఎమ్మెల్యేలున్న మన అసెంబ్లీలోనే కొన్నిసార్లు మన స్వరం వినపడటం లేదు. అలాంటిది పార్లమెంట్‌లో తమిళనాడు బలం తగ్గితే మన ప్రతిపాదనలకు అసలు విలువే ఉండదు. మనకు కనీసం 100 మంది ఎంపీలు ఉండి ఉంటే.. నీట్ పరీక్షను గానీ, జీఎస్‌టీని గానీ, పౌరసత్వ సవరణ చట్టాన్ని గానీ మనపై బలవంతంగా రుద్దే ధైర్యం కేంద్రం చేసేదా?" అని ఆయన ప్రశ్నించారు. తమిళనాడు నుంచి ఉన్న 39 మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా పార్లమెంట్‌లో ఏకమై ఈ పునర్విభజనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన కోరారు.

రూపాయి ఇస్తే 29 పైసలే తిరిగొస్తోంది
దక్షిణాది రాష్ట్రాలు దేశాభివృద్ధికి ఇస్తున్న పన్నుల వాటాపై మాట్లాడిన మంత్రి, తీవ్ర ఆర్థిక వివక్ష జరుగుతోందని ఆరోపించారు. తమిళనాడు కేంద్ర ఖజానాకు ఒక రూపాయి పన్నుగా చెల్లిస్తే, ప్రతిఫలంగా రాష్ట్రానికి తిరిగొస్తున్నది కేవలం 29 పైసలు మాత్రమేనని లెక్కలతో సహా వివరించారు. నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచినా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదికి దక్కే ప్రాతినిధ్యం మరింత దిగజారుతుందని హెచ్చరించారు. అందువల్ల లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతమున్న 543 వద్దే రాబోయే 25 ఏళ్ల పాటు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ తీవ్ర నిరసన: 'దక్షిణాది ప్రధాని అవ్వకూడదా?' అని ఎదురుదాడి!
మంత్రి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భోజరాజన్ తీవ్రంగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురావాల్సిన అవసరమే లేదని, పెరిగిన జనాభా, పట్టణీకరణకు అనుగుణంగా నియోజకవర్గాలు పెరగడం సహజ పరిణామమని సమర్థించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని విభజించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో మూపనార్ వంటి నాయకులకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని గుర్తుచేస్తూ, తమిళ ప్రజలు ఐక్యంగా ఉంటే కచ్చితంగా తమిళుడు కూడా ప్రధాని కావచ్చని భోజరాజన్ వ్యాఖ్యానించారు.














Click it and Unblock the Notifications