యూపీ అసెంబ్లీ బరిలోకి టీమిండియా స్టార్ పేసర్..! ఎస్పీ కంచుకోటలో..!
వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో గత లోక్ సభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి చేతిలో చావుదెబ్బ తిన్న ఎన్డీయే కూటమికి సారి ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు సైతం యూపీ ఎన్నికల్లో ఓడిపోతే 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న అంచనాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న ఓ స్ధానంలో టీమిండియా పేసర్ ను బరిలోకి దించేందుకు ఎన్డీయే కూటమి సిద్దమవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా అసెంబ్లీ స్ధానం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోట. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ నేత మహబూబ్ అలీ ఇక్కడ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ హవాను తట్టుకుని మరీ ఆయన ఘన విజయాలు సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏకంగా 71 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్దిని అలీ ఓడించారు. అలాంటి స్దానంలో టీమిండియా (Team India) పేసర్ మొహమ్మద్ షమీని (Mohammed Shami) బరిలోకి దించాలని ఎన్డీయే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా మొహమ్మద్ షమీ.. ఎన్డీయే భాగస్వామి ఆర్ఎల్డీ నేత జయంతి చౌధురిని కలిశారు. అమ్రోహా స్ధానంలో పోటీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరి భేటీపై వివరాలు బయటికి రాలేదు. కొంతకాలంగా ఫామ్ లో ఉన్నప్పటికీ టీమిండియాలో అవకాశాలు రాక నిరాశగా ఉన్న షమీ.. తన స్వస్ధలం అయిన అమ్రోహా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. అయితే నేరుగా బీజేపీ నుంచి దిగితే మైనార్టీల ఓట్లు పడే అవకాశం లేదు కాబట్టి ఆర్ఎల్డీని వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ కంచుకోటలో షమీని బరిలోకి దించి ఈసారి ప్రయోగం చేయాలని యోగీ భావిస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
