ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ దిచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ.. పథకం గడువును మాత్రం 2028 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల కేటగిరీకి గతంలో కేటాయించిన రూ.1772 కోట్ల బడ్జెట్‌ను రూ. 2,767 కోట్లకు పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 46 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ప్రయోజనం దక్కనుంది.
పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీని తగ్గించిన ప్రభుత్వం
సవరించిన నిబంధనల ప్రకారం,.. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2028 మధ్య రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై సబ్సిడీ ఇవ్వబడుతుంది. దీని కింద, బ్యాటరీ సామర్థ్యం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అయితే ఓ వాహనానికి గరిష్ట సబ్సిడీ పరిమితిని రూ.5,000గా నిర్ణయించారు. అలాగే, ఎక్స్-షోరూమ్ ధర రూ.1.5 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే ఈ పథకం ప్రయోజనానికి అర్హత పొందుతాయి. సబ్సిడీ మొత్తం వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో 15% లేదా రూ.5,000 (ఏది తక్కువైతే అది)కు పరిమితం చేయబడుతుంది. గతంలో, ఈ పథకం కింద సబ్సిడీ ఎక్కువగా ఉండేది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి kWhకు రూ.5,000 సబ్సిడీ ఉండేది. ఓ వాహనానికి గరిష్ట పరిమితి రూ.10,000గా ఉండేది. దీనిని ఏప్రిల్ 1, 2025 నుంచి తగ్గించడం జరిగింది.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఈవీ తయారీని బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన పీఎం ఇ-డ్రైవ్ పథకంలో ఈ మార్పులు చేశారు. సబ్సిడీ క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి గడువు డిసెంబర్ 31, 2027. మార్చి 31, 2028 తర్వాత ఎలాంటి చెల్లింపులు చేయబడవు. ఈ పథకానికి నిధుల పరిమితి ఉంది. కేటాయించిన నిధులు మార్చి 31, 2028 లోపు అయిపోతే, ఈ పథకం ముగుస్తుంది. కొత్త క్లెయిమ్‌లు స్వీకరించబడవు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్న తరుణంలో పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీని తగ్గించాలన్న నిర్ణయం వెలువడింది. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,52,787 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య 2026 ఆర్థిక సంవత్సరానికి 14.6 లక్షలకు పెరిగింది. ఈ పథకం ద్విచక్ర వాహనాలకు మాత్రమే పరిమితం కాదు. ఇందులో ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ అంబులెన్సులు, ఛార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎల్5 కేటగిరీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల విభాగం తన అమ్మకాల లక్ష్యాన్ని చేరుకున్నందున, డిసెంబర్ 2025లో ఆ వాహనాలకు ఇచ్చే సబ్సిడీలను దశలవారీగా తొలగించారు. మీరు సమీప భవిష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ప్రభుత్వ నిర్ణయం ద్వారా మీరు మార్చి 31, 2028 వరకు రూ.5,000 వరకు ప్రభుత్వ సబ్సిడీని పొందవచ్చు.














Click it and Unblock the Notifications