రోడ్లపై అక్రమ పార్కింగ్ లకు చెక్ ..తెలంగాణాలో కొత్త పార్కింగ్ పాలసీ!
తెలంగాణా లో రోడ్లు ఎన్ని ఉన్నా సరే ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పటం లేదు. ఎక్కడికి వెళ్ళినా వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లమీద అక్రమ పార్కింగ్ చేసే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ అక్రమ పార్కింగ్ లకు చెక్ పెట్టటం కోసం, అలాగే ట్రాఫిక్ జామ్ ను తగ్గించడం, రోడ్డుప్రమాదాలను నివారించడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పార్కింగ్ పాలసీని తీసుకువస్తోంది.
డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేసిన రవాణా శాఖ
రవాణా శాఖ ఈ మేరకు డ్రాఫ్ట్ పాలసీని సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది.ప్రభుత్వం ఆమోదం తర్వాత ఈ డ్రాఫ్ట్‌ను ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాల కోసం వెబ్‌సైట్‌లో ప్రకటించనుంది. ఈ పాలసీ ప్రకారం రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నో-పార్కింగ్ జోన్‌లలో వాహనాలు పార్క్ చేస్తే వెంటనే టోవ్ చేయబడతాయి.టోవింగ్ చార్జీలు, రోజువారీ పార్కింగ్ ఫీజుతో సహా చెల్లించాల్సి ఉంటుంది.

రోడ్డుపై వాహనాలను వదిలేస్తే జరిగేదిదే
బ్రేక్‌డౌన్ అయిన వాహనాలను కూడా రోడ్డుపై వదిలేస్తే టోవ్ చేసి చర్యలు తీసుకోబడతాయి. వాహనం విడుదల చేయడానికి ముందు అన్ని పెండింగ్ చాలాన్లు, జరిమానాలు క్లియర్ చేయాలి.
30-45 రోజుల్లో వాహనం క్లెయిమ్ చేయకపోతే వేలం వేయబడవచ్చు. కాబట్టి వాహనదారులు ఎవరైనా సరే రోడ్డుపై తమ వాహనాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.
రోజువారీ పార్కింగ్ ఫీజు డ్రాఫ్ట్ ఇలా
పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) ద్వారా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కూడా ఈ డ్రాఫ్ట్ లో ప్రతిపాదన చేశారు. ప్రతిపాదిత రోజువారీ పార్కింగ్ ఫీజు డ్రాఫ్ట్ చూసినట్లయితే టూ-వీలర్లు (బైకులు)20 నుండి 30 రూపాయలు, ఆటోలు 35 నుండి 50 రూపాయలు, కార్లు 60 నుండి 80 రూపాయలు, బస్సులు 200 నుండి 300 రూపాయలుగా ఉంది.
ట్రాఫిక్ సమస్యలు తగ్గి, రోడ్డు భద్రత మెరుగుపడేలా చర్యలు
ఈ ఫీజు పట్టణ, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రకారం ఫీజు మారవచ్చు. ఈ కొత్త నిబంధనలు రోడ్లపై పార్కింగ్ చేసే వారికి షాక్ ఇచ్చి, వారు నియమిత పార్కింగ్ స్థలాలను ఉపయోగించేలా ప్రోత్సహిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, రోడ్డు భద్రత మెరుగుపడే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications