హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గంపై వేటు: ఆజాద్ వ్యాఖ్యల అర్థం అదేనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఇటీవల తన రాష్ట్ర పర్యటనలో ఉప ఎన్నికలపై పార్టీ నేతలను సన్నద్ధం చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యల వెనుక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటును సూచిస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆజాద్ రాష్ట్రంలో తన తాజా పర్యటన ద్వారా తమ పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సన్నద్ధం చేశారు. ప్రస్తుతానికి ఏడు నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు నింపాదిగా ఉన్న తరుణంలో మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో ఉప పోరు ఉంటుందంటూ ఆజాద్ బాంబు పేల్చారు. అన్ని స్థానాలకూ ఒకేసారి ఎన్నికలు జరగవులే అన్న రీతిలో తాపీగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్ రెడ్డి సర్కారు ఉప పోరు గురించి ఆజాద్ చేసిన హెచ్చరికతో అప్రమత్తమవుతోంది. ఆజాద్ తన వ్యాఖ్య ద్వారా ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతో పాటు అవిశ్వాసం సందర్భంగా గీత దాటిన జగన్ వర్గంలోని 17మంది స్థానాలకూ ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఆయన ఇలా చెప్పడానికి కారణమేంటి? నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎమ్మెల్యేలు లేరు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్య, కామారెడ్డిలో గంప గోవర్ధన్, కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయగా మహబూబ్ నగర్‌లో ఎమ్మెల్యే రాజేశ్వరర్‌ రెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఈ ఏడు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ఈ ఏడు నియోజకవర్గాల గురించి తాము ఆలోచిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు హాజరైతే ప్రభుత్వానికి అవమానకరమే.

అందువల్ల బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ 17 మందిపై స్పీకర్ కొరడా ఝళిపించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ అవి ప్రారంభం కావడానికి వారం ముందు అంటే ఫిబ్రవరి 8న వెలువడే అవకాశం ఉంది. ఆ లోగా జగన్‌ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటువేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతోపాటు జగన్ వర్గంపై వేటు వల్ల ఖాళీ అయ్యే 17 స్థానాలకూ కలిపి కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఈ విషయాన్నే ఆజాద్ సూచన ప్రాయంగా వెల్లడించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Assembly speaker may take action on YS Jaganmohan Reddy camp mlas soon. Central Minister Ghulam Nabi Azad statement is showing it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X