నాటి సదస్సులోనే దీక్ష చేస్తానని చెప్పా: వైయస్ జగన్
Districts
oi-Srinivas
By Srinivas
|
అనంతపురం: ఇటీవల తాను చేనేత రంగానికి సంబంధించి ఒక సదస్సులో పాల్గొన్నప్పుడు వేదిక పైకి ఒకతను వచ్చి మా ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారని, ఆ సమయంలో వేదిక పైనుండి తాను మాట్లాడుతున్న సమయంలో వారి ఆత్మహత్యల విషయమే బుర్రలో తిరిగిందని, అందుకే ఆ సదస్సులోనే చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ధర్మవరంలో మూడు రోజుల పాటు 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని చెప్పానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన సాయంత్రం అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో మూడు రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ దీక్షతో ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా దీక్ష చేద్దామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్సు పక్కన పెట్టడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్మవరం పట్టుచీరలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చందిన చీరలన్నారు. ఇంతటి ప్రసిద్ధి కెక్కిన ధర్మవరంలో గత కొద్దికాలంగా చేనేత కార్మికుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు. గత ఒక్క సంవత్సరంలోనే ధర్మవరం పట్టణంలో 17 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కాగా ఈ దీక్షలు గుర్నాథ్ రెడ్డి, విజయ చందర్, భూమా నాగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.