హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే శాసనసభ తెలంగాణ, మద్యం సిండికేట్ల వ్యవహారంపై దద్దరిల్లింది. విపక్షాల గందరగోళంతో పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు. విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ తెలంగాణపై వాయిదా తీర్మానం ఇచ్చాయి. సభ ప్రారంభం కాగానే టిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణపై చర్చకు పట్టుపట్టారు. మరోవైపు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు మద్యం సిండికేటు వ్యవహారంపై చర్చించాలని పట్టుపట్టారు. మంత్రులే మద్యం సిండికేటు గాళ్లు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని సముదాయించే ప్రయత్నాలు స్పీకర్ చేశారు.
అసెంబ్లీ మొదటి రోజే గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగే రోజు ఇలా చేయకూడదని ఆయన విపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. విపక్షాలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ అసెంబ్లీని అరగంట పాటు వాయిదా వేశారు. రెండోసారి సమావేశమైనప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో స్పీకర్ సభను మరో పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. ఆ తర్వాత మూడోసారి సభ సమావేశమైంది. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి గవర్నర్ ప్రసంగంపై చర్చను ప్రారంభించారు. అయితే విపక్షాలు మరోసారి తెలంగాణ, మద్యం మాఫియాపై పోడియం చుట్టుముట్టాయి. దీంతో స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు.