హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంగళవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ రెండోసారి పదిహేను నిమిషాలు వాయిదా పడిన అనంతరం బొత్స, చిరుతో భేటీ అయ్యారు. సభలో వ్యవహరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మరికొందరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ మద్యం సిండికేట్, టిఆర్ఎస్, బిజెపి తెలంగాణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై సిఎం, బోత్స, చిరు, ఉప ముఖ్యమంత్రి వేరు వేరుగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి, విప్‌లు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, నాని, అనీల్‌లు భేటీ అయ్యారు. వారు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వారు బాబును కోరారు. కాగా రెండుసార్లు వాయిదా పడిన అనంతరం సభ మూడోసారి సమావేశమైంది.