జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో చెబుతా: కిరణ్

జూడాల సమ్మె విషయం మంత్రివర్గ ఉపసంఘం చూసుకుంటుందని చెప్పారు. సమ్మె వల్ల ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందలేదని అలా జరిగితే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. పేదలకు వైద్యం అందించకుండా చూడటం సరికాదన్నారు. జూడాల సమ్మె కారణంగా 880 మంది డాక్టర్లను ఆసుపత్రులకు డిప్యూటీ చేసినట్లు చెప్పారు. ప్రతిపక్షాలు సభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేసులపై ఐఏఎస్ అధికారులు భయపడాల్సిన పని లేదన్నారు. ఐఏఎస్ అధికారులు తమ అభిప్రాయం చెప్పారని, విచారణ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదని, కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు.
ప్రజారాజ్యం పార్టీ విలీనం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఇరు పార్టీలు తీర్మానం చేసిన అనంతరం విలీన ప్రక్రియ పూర్తవుతుందన్నారు. సమాచార కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరిగిందని ఆయన చెప్పారు. పోలవరం టెండర్ల ఫైలు ఇంకా తన వద్దకు రాలేదన్నారు. తాము ఎన్నికలకు భయపడటం లేదన్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని, 2011 జనాభా లెక్కల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. సభలో ఏ అంశం చర్చకు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీడియాలో కథనాలు వచ్చినంత మాత్రాన పార్టీలో ఏదో జరుగుతుందనుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications