హైదరాబాద్: మద్యం సిండికేట్ వ్యవహారంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, తన వాళ్లకు మద్యం దుకాణాలు ఉన్నాయని ప్రకటించిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలే లక్ష్యంగా అసెంబ్లీలో దాడి చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పార్టీ శాసనసభ్యులతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెండు విడతలుగా భేటీ అయ్యారు. మద్యం ముడుపులు, ఎసిబి దాడుల పైనే మొదటగా దృష్టి కేంద్రీకరించాలని ఆయన నిర్ణయించారు. ఎక్సైజ్ మంత్రి మోపిదేవికి రూ.10 లక్షలు ముడుపులు ఇచ్చానని ఒక మద్యం వ్యాపారి చెప్పినా మంత్రి రాజీనామా చేయక పోవడాన్ని తప్పుబట్టాలని టిడిపి భావిస్తోంది.
తన కుటుంబ సభ్యులకు 31 మద్యం షాపుల్లో వాటాలు ఉన్నాయని చెప్పిన మంత్రి బొత్సపై కూడా ధ్వజమెత్తాలని పార్టీ భావిస్తోంది. మద్యం వ్యాపార వ్యవహారాల్లో బొత్సకు ప్రత్యక్ష ప్రమేయం ఉందని, విజయనగరంలో షాపులకు జరిగిన వేలం పాటలో ఆయన అందరినీ రింగ్ చేసి పాట పెరగనీయకుండా చేశారని, ఆ ఊరికి పక్కన ఉన్న పట్టణాల్లో రేట్లు కోట్లలోకి వెళ్తే విజయనగరంలో చాలా తక్కువ ధరకు వెళ్లాయని, సిండికేట్‌లో బొత్సకు భాగస్వామ్యం ఉందని వారు అనుమానిస్తున్నారు. దీంతో సభలో ఆయనను వదిలి పెట్టవద్దని టిడిపి నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు.