కడప: పులివెందులలో పోలీసులు తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. కలెక్టరును కలిసిన విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు బనాయిస్తున్న తప్పుడు కేసుల వివరాలను వినతిపత్రం ద్వారా కలెక్టరుకు తెలిపారు. 2011 ఉప ఎన్నికల అనంతరం అధికార పార్టీ నేతలకు తలొగ్గి పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ధర్నా, ఆందోళన వంటి చిన్న చిన్న వాటి పైనా కూడా కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరుస్తున్నారని వివరించారు. మరికొందరిని వివిధ కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా తమ పార్టీ నేతలైన శంకర రెడ్డి, చిన్నప్ప రెడ్డి, మల్లికార్డున రెడ్డి తదితరులపై తప్పుడు కేసులను నమోదు చేశారని తెలిపారు.
తమ పార్టీ నేతలపై ఉద్దేశ్య పూర్వకంగా కేసులు బనాయిస్తున్నారని అన్నారు. పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధం లేకున్నప్పటికీ తమ పార్టీ నేతలపై కేసు పెట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఉద్దేశ్య పూర్వకంగా బనాయిస్తున్న ఈ కేసులను ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలని విజయమ్మ కలెక్టర్‌ను కోరారు. పార్టీ మహిళా కార్యకర్తల పైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె చెప్పారు. ఉప ఎన్నికల నేపథ్యంలో వారందరినీ అరెస్టు చేయించే కుట్రకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. నమోదైన కేసులు పరిశీలించి తమ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆమె కలెక్టర్‌ను కోరారు.