హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చే పది ఓట్లు కూడా పోతాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. రాత్రికి రాత్రి చంద్రబాబు తెలంగాణకు వెన్నుపోటు పొడిచారని, ఏ మొహం పెట్టుకుని తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రామగ్రామాన సమావేశాలు పెట్టి తమ పార్టీ విషయం తేలుస్తానని చంద్రబాబు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు సంగతి తెలంగాణ ప్రజలు ఎప్పుడో తేల్చేశారని ఆయన అన్నారు. గతంలో ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు గల్లంతయ్యాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు సంగతి తేల్చడానికి మళ్లీ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటున్న చంద్రబాబు శాసనసభలో తీర్మానానికి ఎందుకు వెనకాడుతున్నావని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి పీఠంపై ఆశ తప్ప చంద్రబాబుకు తెలంగాణ అమరవీరుల గురించి పట్టదని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసుతో కుమ్మక్కయి చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగాలంటే తెలంగాణ తీర్మానం ఎప్పుడు ప్రతిపాదిస్తారో చెప్పాలని ఆయన అన్నారు.