హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి బహిష్కృత నేత యూసఫ్ అలీ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. యూసఫ్ అలీని టిఆర్ఎస్ గురువారమే పార్టీ నుండి బహిష్కరించింది. ఆయన అప్పుడే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంసిద్ధమైనట్లుగా సమాచారం. యూసఫ్ అలీ తెలంగాణ రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశారు. అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం గురువారం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
యూసఫ్ పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఆయనపై వేటు వేశారు. యూసఫ్ అలీ గత 2009 సాధారణ ఎన్నికలలో మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బరిలోకి దిగారు.