సాయి ఆఫీస్‌లోని ల్యాప్‌టాప్ ఇచ్చేయండి: సిబిఐకి కోర్టు
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల ఆడిటర్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కార్యాలయంలో లభించిన ల్యాప్‌టాప్‌ను తిరిగి అప్పగించాలని నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం సిబిఐ అధికారులను ఆదేశించింది. మార్చి 31వ తేదిలోగా ఈ ల్యాప్ టాప్‌ను సువర్ణభూమికి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పగింతపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని న్యాయస్థానం సిబిఐకి సూచించింది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆయన ఇంటిలో, కార్యాలయంలో సోదాలు చేసిన సిబిఐ పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాప్ టాప్ తమకు అప్పగించాలని సువర్ణభూమి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.