హైదరాబాద్: ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే పార్టీ అధిష్టానం రాత్రికి రాత్రే ఏమైనా చేస్తుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి శుక్రవారం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య విషయంలో అదే జరిగిందన్నారు. కిరణ్‌ను మార్చాలని తాము ఎప్పుడు అధిష్టానాన్ని డిమాండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూటే సపరేటు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సీనియర్లు సహకరించడం లేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సీనియర్లను ముఖ్యమంత్రి ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు.
ఎసిబి దాడులతో మద్యం సిండికేట్లలో వాస్తవాలు బయటకు రావన్నారు. వాస్తవాలు తెలువాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో ఎక్కువ మంది నేతలు లాబీలకే పరిమితమవుతున్నారని ఆయన అన్నారు. కాగా ముఖ్యమంత్రిని మార్చాలని పలువురు సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.