గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత మాకినేని పెద రత్తయ్య శుక్రవారం షాక్ ఇచ్చారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. స్టేట్ బాడీలో ఉన్న తనను తొలగించే అర్హత జిల్లా కన్వీనర్‌కు లేదని విమర్శించారు. గవర్నింగ్ బాడీ నుండి జిల్లా నేత తనను తొలగించడమేమిటి అన్నారు. తానే పార్టీ నుండి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మూడు రోజుల కిందటే రాజీనామా పత్రం రాసి పెట్టుకున్నానని చెప్పారు.
జిల్లాలో ఇద్దరు ముగ్గురు నేతలతోనే ఇబ్బంది ఉందని ఆయన అన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసులో కొనసాగనన్నారు. తాను కార్యకర్తల ఒత్తిడితో రాజీనామా చేయలేదని చెప్పారు. కాగా మాకినేని పెద రత్తయ్య తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజుల నుండి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరులో పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి విడద ఓదార్పు యాత్ర నిర్వహించిన సమయంలోనూ ఆయన అలక బూనారు. ఆ తర్వాత నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత పలుమార్లు ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి