హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు బినామీ ఆస్తుల చిట్టా విప్పిన కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బినామీ ఆస్తులంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నెల్లూరు జిల్లాలోని బలాయిపల్లి గ్రామంలోని భూవివరాలను వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబుకు 300 ఎకరాల భూమి ఉందని, 17 ఎకరాల దళిత, గిరిజన భూములను చంద్రబాబు ఆక్రమించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు భూమిపై విచారణ జరిపి, వివరాలు వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కాక ముందు చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు భార్య పేర్ల మీద ఉన్న భూములు ఆ తర్వాత ఇతరుల పేర్ల మీదికి బదిలీ అయ్యాయని ఆయన చెప్పారు. అంతకు ముందు భూములు చంద్రబాబు పేరు మీద, ఆయన కుమారుడు లోకేష్ పేరు మీద ఆ భూములు ఉన్న మాట నిజమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు బలాయిపల్లి గ్రామంలోని భూములను తన బంధువుల పేర్ల మీదికి బదలాయించారని ఆయన చెప్పారు. ఆ భూములు ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి, వారు చంద్రబాబుకు ఏమవుతారానే వివరాలు వెల్లడించారు. చంద్రబాబు తన పేరు మీద ఉన్న 7.1 ఎకరాల భూమిని గిఫ్ట్ కింద తన కుమారుడు లోకేష్ పేరు మీదికి బదలాయించారని ఆయన అన్నారు. లోకేష్ పేరు మీద ఉన్న 6.30 ఎకరాల భూమిని చంద్రబాబు పేరు మీదికి గిఫ్ట్ కింద బదలాయించారని ఆయన చెప్పారు. బలాయిపల్లిలోని 300 ఎకరాల భూములను తన చెల్లెళ్లు, తన బావ ఇతర బంధువుల పేర్ల మీదికి బదలాయించారని ఆయన చెప్పారు. బినామీ ఆస్తుల విషయంలో చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ వన్ అని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబుది కిరికిరి రాజకీయమని ఆయన అన్నారు. తనకు 70 ఎకరాల భూమి ఉందనే ఆరోపణపై తాను సవాల్ చేసిన తర్వాత చంద్రబాబు నోరు మూశారని, బలాయిపల్లి భూముల గురించి తప్పకుండా చంద్రబాబు నోరు విప్పాలని ఆయన అన్నారు. చంద్రబాబు భూములున్న గ్రామం ఉప ఎన్నిక జరుగుతున్న కోవూరు నియోజకవర్గం పరిధిలోనే ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు బండారం అక్కడ కూడా బయటపడాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తన, తన కుటుంబ సభ్యుల పేర్లను తన బంధువుల పేర్ల మీదికి బదలాయించారని, ఆ బదలాయింపు పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ భూముల విషయం కాదు, చంద్రబాబు ఆస్తులకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయని, పరంపరగా అవి ముందుకు వస్తాయని ఆయన అన్నారు.

అన్నా హజారే వేలు విడిచిన మేనమామగా చంద్రబాబు ఫోజులు కొడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆస్తుల గురించి అడిగితే సర్వే చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెప్పారని, ఇంకా ఎన్నాళ్లు సర్వే చేస్తారని ఆయన అన్నారు.

English summary
TRS president K Chandrasekhar Rao alleged that TDP president Chandrababu Naidu has indulged in land grabbing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X