హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాఫ్తును సిబిఐ వేగవంతం చేసింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలపై దర్యాఫ్తు చేసేందుకు అనుమతివ్వాలని సిబిఐ అధికారులు నాంపల్లి కోర్టులో లెటర్ ఆఫ్ రోగోరేటరీ పిటిషన్‌ను దాఖలు చేశారు. 1500 పేజీలతో కూడిన పిటిషన్‌ను సిబిఐ దాఖలు చేసింది. జగన్ కంపెనీల్లో విదేశాలకు చెందిన ఆరు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని అక్కడకు వెళ్లి విచారించేందుకు తమకు అనుమతివ్వాలని కోరారు. అందుకు కోర్టు ఆమోదం తెలిపింది. బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్, దుబాయ్, మారిషస్, హాంగాంగ్, సింగపూర్, ఫ్రాన్స్ దేశాల కంపెనీల ప్రతినిధులను విచారించాలన్న సిబిఐ ప్రతిపాదనను కోర్టు మంగళవారం అంగీకరించింది.
కాగా జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ మరోమారు సిబిఐ ఎదుట మంగళవారం హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన దిల్ కుషాలోని దర్యాఫ్తు కార్యాలయానికి వచ్చారు. కేసులో నిమ్మగడ్డ 12వ నిందితుడు. ఆయనను సిబిఐ ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించింది. జగన్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ అందుకు ప్రతిఫలంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వాన్ పిక్ సీ పోర్టు ప్రాజెక్టు కోసం పదిహేనువేల ఎకరాలను పొందారు. దీనికి సంబంధించి సిబిఐ ఆయనను మరోమారు పిలిచింది. రెండు రోజుల క్రితమే వాన్ పిక్‌కు భూకేటాయింపులు జరిపిన ఐఏఎస్ అధికారి అప్పటి భూపరిపాలన శాఖ కమిషనర్‌ను కూడా ప్రశ్నించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్ట్రర్ల నుంచి అధికారులు వివరాలు సేకరించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి