రోశయ్యకు బిగుస్తున్న ఉచ్చు, రాష్ట్రపతికి ఫిర్యాదు

అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు.
కేసు విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది. సాక్షుల విచారణ పూర్తయింది. రోశయ్యకు క్లీన్ చిట్ ఇస్తూ ఎసిబి ఇచ్చిన తుది నివేదిక రాజకీయ ప్రమేయంతో కూడిందని, ఎసిబి ఐఎఎస్ అధికారుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేదని, రోశయ్యకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలున్నాయని, రాష్ట్రపతికి, ప్రధానికి ఇందుకు సంబంధించి తాజాగా లేఖ రాశామని తెలంగాణ న్యాయవాదుల సంఘం తెలిపింది.
ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే 9.14 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు.