హైదరాబాద్: తొలి సంతకం ఫ్యాషనై పోయిందంటూ తెలుగుదేశం పార్టీ మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించింది. టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ... తొలి సంతకం అనే మాట ఈ మధ్య కాలంలో ఫ్యాషనై పోయిందన్నారు. అందరూ అదే అంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పని తీరు చూసి నీరో చక్రవర్తే నివ్వెర పోతారన్నారు. అధికారం కోల్పోయి మేం ప్రతిపక్షంలో ఉన్నామని మాపై అధికార కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తే ప్రజలకు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న ఢిల్లీ పర్యటనలు పైరవీలకే తప్ప ప్రజా సమస్యలపై కాదని ఆయన అన్నారు. ఇది సమ్మెల కాలంగా మారిపోయిందన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ, అభివృద్ధి మండలి పేరుతో తెలంగాణను మరోసారి మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. దీనిని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టాలని సూచించారు. తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. గత 2009 డిసెంబర్ 9వ తేదిన ఇచ్చిన హామీకి యుపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి