అదిలాబాద్/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం పేరుతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నేతలు నయవంచనకు పాల్పడుతూ సమైక్యవాదానికి మడుగులొత్తుతున్నారని, ఓటు ఆయుధంతో వారిని పాతరేస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి జోగు రామన్నకు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో ఆమె టిడిపి, కాంగ్రెసులపై విరుచుకు పడ్డారు. ఎన్నో త్యాగాలను చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చామంటూ కాంగ్రెసు పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని, తెలంగాణ కోసం ఏడువందల మందికి పైగా ప్రాణాలు త్యజించినా ప్రత్యేక రాష్ట్ర ప్రకటనకు వెనుకడుగు ఎందుకు వేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిలో కూర్చునే అర్హత లేదని ఆ పార్టీ నేత నాయిని నర్సింహా రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. పరిశ్రమలకు విద్యుత్ ను సరఫరా చేయలేకపోతే ఆ సీట్లు కూర్చునే నైతిక హక్కు లేదన్నారు. సిఎం వెంటనే జోక్యం చేసుకొని పరిశ్రమలకు సక్రమంగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.