కాంగ్రెసులో కెసిఆర్ రాజ్యసభ చిచ్చు, రెబెల్‌కు సై

తెలంగాణవాదాన్ని బలంగా వినిపిస్తున్న కె. కేశవరావుకు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని అంటున్నారు. టికెట్ దక్కకపోతే కేశవరావు తెలంగాణ నినాదంతో రంగంలోకి దిగితే బాగుంటుందనే ఆలోచన తెరాస వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు కేశవరావును తెరాస నాయకులు ప్రోత్సహిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. తెరాసకు ప్రస్తుతం 13 మంది శాసనసభ్యులున్నారు. ఉప ఎన్నికల్లో కచ్చితంగా ఐదు స్థానాలు గెలుస్తామనే ధీమాతో కెసిఆర్ ఉన్నారు. దాంతో తమ పార్టీ బలం మరింత పెరుగుతుందని, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెసుకు షాక్ ఇచ్చే విధంగా వ్యవహరించవచ్చునని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ సీటు కోసం కేశవరావు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేశవరావును తిరిగి నామినేట్ చేయాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా కోరుతున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు అధిష్టానం కేశవరావుకు అవకాశం కల్పించకపోతే తమ వ్యూహం ఫలిస్తుందని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కేశవరావు తిరుగుబాటు అభ్యర్థిగా దిగేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. కాంగ్రెసు అధిష్టానం పట్ల ఆయన పూర్తి విశ్వాసం ప్రకటించారు.












Click it and Unblock the Notifications