రాజమండ్రి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న గలాటా వల్ల కోస్తా అభివృద్ధి చెందుతుందని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ ఆదివారం అన్నారు. కెసిఆర్ గలాటా కలిసి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లోని మెజార్టీ జనాలలో తెలంగాణ వాదం లేదని ఆయన అన్నారు. సెంటిమెంట్ పేరుతో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. టిజి వెంకటేష్ ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కెసిఆర్ పైన విమర్శలు చేశారు.
కాగా తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రత్యేక రాష్ట్ర నినాదమే ప్రధానంగా ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. టిఆర్ఎస్, బిజెపి ప్రత్యేక తెలంగాణ పేరుతో ఎన్నికల బరిలోకి దిగగా, టిడిపి తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతోంది. ఇక కాంగ్రెసు అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ప్రజల్లోకి వెళుతోంది.