హైదరాబాద్: ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒక స్థానంలో ఓడిపోయినా ఉద్యమానికి వచ్చే నష్టమేమీ లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. మహబూబ్‌నగర్‌లో పోటీ చేస్తున్నందుకు తమను తెలంగాణ ద్రోహులుగా టిఆర్ఎస్ చిత్రీకరించడంపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభ్యుడి మృతి కారణంగా ఖాళీ అయిన స్థానంలోనే తాము పోటీ చేస్తున్నామని, టిఆర్ఎస్‌తో కలిసి లేకపోతేనే తెలంగాణ ద్రోహులంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం తొలి నుంచి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, సీమాంధ్ర నేతలకు సర్దిచెప్పి, రాష్ట్ర విభజనకు కట్టుబడ్డామని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపిస్తున్నామని, మా నేత సుష్మాస్వరాజ్ లోక్‌సభలో పలుమార్లు తెలంగాణ అంశాన్ని లేవనెత్తారన్నారు. జాతీయ స్థాయి లో తెలంగాణ కోసం పోరాడుతూ యూపీఏపై ఒత్తిడి తెస్తున్న బిజెపిని టిఆర్ఎస్ ఇప్పు డు తెలంగాణ ద్రోహి అంటే ఏమనుకోవాలన్నారు.
మహబూబ్‌నగర్‌లో బిజెపికి టిఆర్ఎస్ మద్దతు ఇవ్వనప్పటికీ, తెలంగాణ కోసం రాజీనామా చేసి టిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న నలుగురికీ తాము మద్దతు ఇస్తున్నామన్నారు. మహబూబ్‌నగర్‌లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ స్థానంలో పోటీ చేస్తున్న జాతీయ పార్టీ బిజెపిని గెలిపించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రజలను కోరారు. మ.నగర్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ఐకాస నేతలు అందరూ బిజెపికే మద్దతు ఇస్తున్నారన్నారు. తమ పార్టీ అగ్రనేతలు రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బుధవారం నుంచి పోటీ చేస్తారని చెప్పారు.