బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, బిఎస్సార్ పార్టీ అధినేత శ్రీరాములు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు, బిజెపికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు. సుమారు రూ.200 కోట్లకు పైగా నిధులు ఇచ్చినట్లు చెప్పారు. కన్నడనాట బిజెపి సర్కారు నిలబడిందంటే అది మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, తన పుణ్యమేనని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా గదగ్‌లో నిరాహార దీక్ష చేపట్టిన శ్రీరాములు ఈ విషయాలు వెల్లడించారు. 2004 ఎన్నికల తర్వాత ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించడం సాధ్యం కాక మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు బిజెపికి దాదాపు రూ.200 కోట్ల విరాళాలు ఇచ్చామన్నారు. ఆ ఎన్నికల్లో కూడా బిజెపికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో తాను, గాలి జనార్దన రెడ్డి కలిసి ఐదుగురు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడగట్టామని తర్వాత మరింత మంది ఎమ్మెల్యేల బలం కావాలని యడ్యూరప్ప కోరగా, దానికీ సహకరించామన్నారు. అప్పట్లో ఆయన నెలకు రూ. 7-8 కోట్లు కావాలని తమను కోరగా, అంతకంటే ఎక్కువగా అంటే 10 కోట్ల చొప్పున ఏడునెలల పాటు ఇచ్చామని శ్రీరాములు తెలిపారు. తాము ఎంత కష్టపడినా, ఎన్ని త్యాగాలు చేసినా యడ్యూరప్ప మాత్రం విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని వాపోయారు.
గాలిని అక్రమంగా కేసులో ఇరికించినా అప్ప స్పందించలేదన్నారు. అందుకే బిజెపితో తాను తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. బిజెపి అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం గాలి సోదరులకు ద్రోహం చేశాయని మండిపడ్డారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటాయన్నారు. అయితే శ్రీరాములు పేల్చిన బాంబుతో బిజెపి ఉలిక్కిపడింది. పార్టీ తరఫున మంత్రులు రామదాస్, విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఇక్కడ ఓ ప్రకటన చేశారు. ముడుపులకు ఆధారాలు చూపించాల్సిన బాధ్యత శ్రీరాములు పైనే ఉందన్నారు. ఇంత డబ్బు గాలి బ్రదర్స్‌కు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. శ్రీరాములు ఆరోపణలను తోసిపుచ్చలేమని బిజెపి మాజీ అధ్యక్షుడు బీబీ శివప్ప అన్నారు. ఢిల్లీలో ఉన్న యడ్డి ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. బెంగళూరుకు వచ్చాకే బదులిస్తానని చెప్పారు. కాగా గదగ్‌లోని శ్రీ తొంటధార్య మఠాధిపతికి శ్రీరాములు ఈ విషయాన్ని చెప్పినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగులను కన్నడ టివి వార్తా ఛానళ్లు మంగళవారం సాయంత్రం ప్రసారం చేశాయి.