న్యూఢిల్లీ: రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెసు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. పాతవారికి ఎవరికి కూడా రాజ్యసభ సీట్లు దక్కకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. రాష్ట్రం నుంచి ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెసు నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభ నుంచి దాసరి నారాయణ రావు, కె. కేశవరావు, సంజీవరెడ్డి, రషీద్ అల్వీ రిటైర్ అవుతున్నారు. వీరిలో ఎవరిని కూడా తిరిగి నామినేట్ చేయడానికి కాంగ్రసు అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
రషీద్ అల్వీ స్థానంలో జాఫర్ షరీఫ్‌ను గానీ షకీల్ అహ్మద్‌ను గానీ రాజ్యసభకు నామినేట్ చేయవచ్చునని తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ బెర్త్ ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచన. దీంతో దాసరి నారాయణ రావును తిరిగి నామినేట్ చేయడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. కేశవరావు తెలంగాణలో అతిగా వ్యవహరించారని అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, రేణుకా చౌదరి, వెంకట్రామిరెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు. రేణుకా చౌదరిని కూడా రాజ్యసభకు ఎంపిక చేయవచ్చుననే వార్తలు వస్తున్నాయి. మరో సీటు తెలంగాణకు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. అలా ఇచ్చే సమక్షంలో సురేష్ రెడ్డి పేరు ముందుకు వస్తుందని చెబుతున్నారు.