నాటు బాంబులతో నన్ను చంపేందుకు కుట్ర: కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్: పదకొండేళ్లుగా తాను ఏం చేశానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రశ్నించారని, ఈ కాలంలో తెలంగాణ ప్రజలను తాను పులి బిడ్డలుగా మార్చానని ఈ విషయం కిరణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. ఆయన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజయ్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి, కాంగ్రెసుపై నిప్పులు కక్కారు. కాంగ్రెసు చమత్కారాల పార్టీ అని, టిడిపి మోసకారి పార్టీ అని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణపై మాట తప్పితే, టిడిపి అభ్యర్థి కడియం శ్రీహరి రాజయ్య విషయంలో మాట తప్పారన్నారు. రాజయ్య రాజీనామా చేస్తే ఆయనకు మద్దతిస్తానని చెప్పిన శ్రీహరి ఇప్పుడు ఆయన పైనే పోటీకి దిగుతున్నారని విమర్శించారు. కిరణ్ రూపాయికి కిలో బియ్యం అంటే చంద్రబాబు ఉచిత బియ్యం అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఇస్తే వారు వరంగల్ వచ్చినప్పుడు మేమే ఉచితంగా బియ్యం ఇస్తామన్నారు.

సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే రాజయ్య ఖచ్చితంగా అరవై వేల మెజార్టీతో గెలుస్తారనిపిస్తోందన్నారు. కాంగ్రెసు మోసం చేసింది, టిడిపి మాట మార్చిందన్నారు. టిడిపికి ఓటేస్తే మోర్లే పడేసినట్లేనన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ఓటేస్తే తెలంగాణ ఉద్యమం లేదంటారని, అదే రాజయ్యకేస్తే ఉద్యమం ఉందని వారే అంటారన్నారు. టక్కుటమారాలు చేసి ఒకటో రెండు సీట్లు గెలిచి తెలంగాణవాదం లేదని చెప్పాలని వారు చూస్తున్నారన్నారు. సకల జనుల సమ్మె ఉద్యమం జరిగినప్పుడు రాజయ్య మూడు రోజులు జైళ్లో ఉన్నారని, అప్పుడు కడియం ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెసు తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసిందన్నారు. తెలంగాణ కోసమే ఈ ఎన్నికలు అన్నారు. సమైక్యవాదుల గుండెల్లో నిద్ర పోతామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని కానీ అది సాధ్యం కాదన్నారు.

తెలంగాణ ప్రజలు బాబును జన్మలో సిఎం కానివ్వరన్నారు. తెలుగుదేశం పక్కా ఆంధ్రా పార్టీ అన్నారు. టిడిపిలో తెలంగాణ వారు అధ్యక్షులు అయ్యే అవకాశం లేదన్నారు. తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేతలు బాబు చెప్పులు మోస్తున్నారన్నారు. స్టేషన్ ఘనపూర్ ప్రజలు రాజయ్యను గెలిపించడమే కాదని కాంగ్రెసు, టిడిపిలకు డిపాజిట్ దక్కనివ్వ వద్దని సూచించారు. తెలంగాణ ప్రజల ఆజ్ఞ మేరకే రాజీనామా చేశాడన్నారు. బాబు ఊసరవెల్లిలా మారాడని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓట్లతో కిరణ్ చెంప చెల్లుమనిపించాలన్నారు. దళితుల ఓట్లు ఎవరికీ పోవన్నారు. నేను మీ బిడ్డనని, మీ మంచి కోరతానని అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రతి దళిత బిడ్డకు మూడెకరాల భూమి ఉచితంగా ఇస్తామన్నారు. నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నాటు బాంబులతో చంపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. పుట్టుక, చావు దైవ నిర్ణయం అన్నారు. నాతో పాటు హరీష్ రావుకు ప్రాణభయం ఉందన్నారు.

ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామన్నారు. ఈ ఎన్నికలు ఓ ప్రత్యేక కారణం వల్ల వచ్చాయన్నారు. తెలంగాణ రాజకీయ ఫ్యాక్టరీకి సుమారు వంద మంది ఎమ్మెల్యేలు, పదిహేడు మంది ఎంపీలు ఉండాలన్నారు. అలా అయితేనే మనకు న్యాయం జరుగుతుందన్నారు. ఏడుమందల మంది తెలంగాణ కోసం చనిపోతే బాబు పరామర్శించారా అని అన్నారు. అజంజాహీ మిల్లును బాబు అమ్మేశాడన్నారు. అతను మనకు స్వేచ్ఛనివ్వడమేమిటని మనమేమైనా బానిసలమా అన్నారు. మా ప్రాణం పోయినా మేం తెలంగాణవాదం విడువమన్నారు. చివరలో కెసిఆర్ కారు గుర్తుకే మన వోటు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+