హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ విప్‌లు అత్యుత్సాహంతో గందరగోళానికి గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సోమవారం ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోందని విమర్శించారు. అవినీతి మంత్రులను ప్రభుత్వం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదన్నారు. వారిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. సభలో కాంగ్రెసు పార్టీ వైఖరి కారణంగా సభా సమయం పూర్తిగా వృథా అవుతోందని విమర్శించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాగా సభలో సకల జనుల సమ్మె సమయంలో తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు, విద్యార్థులపై కేసులు ఎత్తి వేసే విషయంపై చర్చించేందుకు స్పీకర్ అరగంట సమయం కేటాయించారు. మరోవైపు టిడిపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జారీ చేసిన 26 జివోలను వెంటనే స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులను బర్తరఫ్ చేయాలని అన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఉన్న దేవేందర్ గౌడ్, సిఎం రమేష్‌లు నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరూ చెరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. దేవేందర్ గౌడ్‌కు పరిటాల సునిత, ఉమా మాధవ రెడ్డిలు సంతకం చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు గైర్హాజరయ్యారు.