నా స్టైల్లో నేను తెలంగాణవాదం వినిపిస్తా: రేణుకా చౌదరి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: నా స్టైల్లో నేను తెలంగాణవాదం వినిపిస్తానని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి సోమవారం చెప్పారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆమెను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. తాను తెలంగాణ అడపడుచునేనని చెప్పారు. నా స్టైల్లో నేను తెలంగాణవాదం వినిపిస్తానని అన్నారు. జాతీయ స్థాయిలో అవసరాల దృష్ట్యా పార్టీ తనకు అవకాశం కల్పించిందని చెప్పారు. అధిష్టానం వద్ద తాను తెలంగాణవాదం వినిపిస్తానని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన మరో సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణవాదం వినిపించక పోవడంతో ఉప ఎన్నికల ఫలితాలు మాకు వ్యతిరేకంగా వచ్చే అవకాశముందన్నారు. సీనియర్ నేత, తెలంగాణ కోసం పోరాడుతున్న కె కేశవ రావుకు రాజ్యసభ రాకపోవడం బాధాకరమేనని చెప్పారు.
కాగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గం.11.30 నిమిషాలకు నామినేషన్ వేయనున్నారు. ఈ రోజే నామినేషన్ దాఖలుకు చివరి తేది కావడంతో రేణుకా చౌదరి, చిరంజీవి, రాపోలులు మరికొద్ది సేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. టిడిపి నేతలు దేవేందర్ గౌడ్, సిఎం రమేష్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు.