హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావుకు ఆయన వ్యవహార శైలి వల్లే రాజ్యసభ పదవి రాలేదని అంటున్నారు. తెలంగాణ ఉద్యమంపై ఆయన తీసుకున్న స్టాండ్ పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ ఆ అంశంపై పార్టీని కె కేశవ రావు కార్యక్రమాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా ఉన్నందు వల్లే అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వకుండా మొండి చేయి చూపించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోసం పోరాటం చేస్తూ పార్టీని ఇబ్బందులకు గురి చేయని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండెనని పలువురు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. కెకె కూడా తాను తెలంగాణపై తీసుకున్న స్టాండ్ కారణంగానే పార్టీ తనకు అవకాశం ఇచ్చి ఉండక పోవచ్చుననే అభిప్రాయాన్ని సోమవారం వ్యక్తం చేశారు. మరోవైపు కెకెకు షాక్ ఇవ్వడం భవిష్యత్తులో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలనుకునే ఎవరికైనా ఒక హెచ్చరికగా పని చేస్తుందని అభిప్రాయపడుతున్నారట. అయితే ఇది తమకు హెచ్చరిక కాదని తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పడం గమనార్హం.
కాగా గత కొన్నాళ్లుగా కెకె తెలంగాణ విషయంలో జోరుగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. సకల జనుల సమ్మె సమయంలో, ఆ తర్వాత ఆయన తెలంగాణ అంశం విషయంలో సాక్షాత్తూ పార్టీ అధిష్టానం పైన కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే సోమవారం మాట్లాడిన ఆయన తనకు పదవి రాకపోయినప్పటికీ తెలంగాణ విషయంలో మాత్రం రాజీలేదని స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడుతానని చెప్పుకొచ్చారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందని చెప్పారు.