ఐపీఎల్ కొచ్చి కుంభకోణం వెనుక కాంగ్రెస్ పెద్దలు: లలిత్ మోదీ సంచలన బాంబ్!

బీసీసీఐ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన అధ్యాయాలలో ఒకటైన 2010 నాటి కొచ్చి టస్కర్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సంక్షోభంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం లండన్‌లో ప్రవాసం జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. ఓ ఇంటర్వ్యూలో అనేక నమ్మలేని నిజాలను, తెరవెనుక జరిగిన రాజకీయ కుట్రలను బహిర్గతం చేశారు. ఆనాటి కొచ్చి వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, అప్పటి కేంద్ర మంత్రి శశి థరూర్‌ను కాపాడటానికి అప్పటి అధికార యూపీఏ ప్రభుత్వం ఓ బలమైన రాజకీయ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిందని లలిత్ మోదీ సంచలన ఆరోపణలు చేశారు.

వెనుకుండి నడిపించింది ఆమెనే?

ఈ కుంభకోణానికి సంబంధించిన మూలాలను వివరిస్తూ.. శశిథరూర్ దివంగత భార్య సునందా పుష్కర్‌కు సంబంధించిన అనుమానాస్పద ఉచిత ఈక్విటీ నిర్మాణాన్ని తాను నిలదీసినప్పుడు, అప్పటి అధికార యంత్రాంగం మొత్తం తనను పదవి నుంచి తొలగించి, పడగొట్టేందుకు ఏకమైందని లలిత్ మోదీ పేర్కొన్నారు. ఈ వివాదంలో అసలు శశి థరూర్‌కు వెనుక ఉండి నడిపించింది ఎవరనే ప్రశ్నకు లలిత్ మోదీ ఏమాత్రం తడుముకోకుండా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి "సోనియా గాంధీ" పేరును సూటిగా చెప్పారు. ఆ రోజుల్లో అప్పటి పాలకుల నుంచి తనపై తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చేవని.. దివంగత నేతలు అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీల నుంచి తనకు నిరంతరం ఫోన్ కాల్స్ వచ్చేవని ఆయన వెల్లడించారు. వారందరితో తనకు వ్యక్తిగతంగా ఎంతో స్నేహం ఉన్నప్పటికీ, సోనియా గాంధీ అండతో అన్ని వైపుల నుంచి తుపాకులు తన వైపే గురిపెట్టబడ్డాయని, అలాగే కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా కూడా తన వద్దకు వచ్చి ఇలా చేయి, అలా చేయి అంటూ ఒత్తిడి తెచ్చారని లలిత్ మోదీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Lalit Modi Claims Sonia Gandhi Backed Shashi Tharoor in 2010 IPL Kochi Scandal Full Details

ఈ వివాదానికి కారణం అదే..!
ఈ మొత్తం వివాదానికి కొచ్చి కన్సార్టియం సమర్పించిన లోపభూయిష్టమైన, ఒకే వైపు మొగ్గు చూపే ఆర్థిక నమూనాను తాను ఆమోదించడానికి నిరాకరించడమే కారణమని లలిత్ మోదీ స్పష్టం చేశారు. ఆ గ్రూప్ కేరళ ఫ్రాంచైజీని 350 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి వేలంలో దక్కించుకున్నప్పటికీ.. అంతర్గత ఆర్థిక లెక్కలు చూస్తే అది ఖచ్చితంగా భారీ పతనానికి దారితీసేలా ఉందని తాను ముందే పసిగట్టానన్నారు. కన్సార్టియంలో మిగిలిన వాటాదారులందరూ వంద శాతం ఖర్చులు భరిస్తుంటే.. అసలు ఎవరో తెలియని సునందా పుష్కర్ అనే మహిళకు ఏకంగా 25 శాతం ఉచిత ఈక్విటీ, 15 శాతం రాబడిని ఎలా ఇస్తారని తాను మిగిలిన సభ్యులను గట్టిగా ప్రశ్నించినట్లు చెప్పారు. ఆ జట్టు దక్కించుకున్న రోజునే ఆమెకు లభించిన 10 రూపాయల షేరు విలువ ఏకంగా లక్ష రూపాయలకు చేరిందని, అదే సమయంలో మిగిలిన వాటాదారుల షేరు విలువ ఒక్క పైసాకు పడిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ మోసపూరిత ఒప్పందం కేవలం రెండేళ్లలోనే కుప్పకూలుతుందని తనకు ముందే తెలుసని, చివరకు తాను ఊహించినట్లే జరిగిందని లలిత్ మోదీ వివరించారు.

"వినకపోతే ఐటీ రైడ్స్ చేయిస్తా".. బెదిరించిన శశిథరూర్
ఈ వివాదం బెంగళూరులో జరిగిన ఒక అర్థరాత్రి సమావేశంలో పీక్‌కు చేరిందని, తెరవెనుక ఉన్న షాడో వాటాదారుల అసలు గుర్తింపును బహిర్గతం చేసే వరకు తాను అధికారిక ఫ్రాంచైజీ ఒప్పందంపై సంతకం చేయనని భీష్మించుకు కూర్చున్నట్లు లలిత్ మోదీ వివరించారు. ఆ సమయంలో అసలు సునందా పుష్కర్ ఎవరో తనకు తెలియదని.. ఆమె కేవలం ఒక ఆటోమొబైల్ డీలర్ కూతురని లేదా మార్కెటింగ్ పర్సన్ అని కన్సార్టియం సభ్యులు చెప్పిన మాటలను తాను నమ్మలేదన్నారు. సరిగ్గా అదే సమయంలో అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న శశి థరూర్ స్వయంగా తనకు ఫోన్ చేశారని లలిత్ మోదీ వెల్లడించారు. "లలిత్.. సునందా పుష్కర్ గురించి ఎక్కువగా అడగవద్దు, ఆమె నాకు మంచి స్నేహితురాలు.. ఒకవేళ నువ్వు గనుక వినకపోతే, రేపు ఉదయానికల్లా నీపై ఐటీ రైడ్స్ చేయిస్తా" అని శశిథరూర్ తనను ఫోన్‌లోనే బెదిరించినట్లు లలిత్ మోదీ సంచలన ఆరోపణ చేశారు. దానికి తాను తీవ్రంగా స్పందిస్తూ.. "నువ్వు భారత విదేశాంగ మంత్రివి కావచ్చు, కానీ నన్ను బెదిరించే ధైర్యం చేయకు" అని ఫోన్ పెట్టేసానని చెప్పారు. అంతకుముందు కేరళలో కనీసం స్టేడియం కూడా లేకపోయినా.. శశిథరూర్ తన ఇంటికి వచ్చి బ్రతిమిలాడటంతో తాను కొచ్చి జట్టును ఐపీఎల్ బిడ్డింగ్‌లోకి రానిచ్చానని లలిత్ మోదీ అంగీకరించారు.

ఐపీఎల్ కొచ్చి టు సునందా పుష్కర్ మృతి
ఈ వివాదం ముదిరిన తర్వాత 2010 ఏప్రిల్‌లోనే శశి థరూర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత 2011లో బీసీసీఐ ఈ కొచ్చి ఫ్రాంచైజీని నిబంధనల ఉల్లంఘన కింద పూర్తిగా రద్దు చేసింది. ఇక 2014లో ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించడానికి ముందు జరిగిన ట్విట్టర్ సంభాషణల గురించి లలిత్ మోదీ మాట్లాడుతూ.. ఆ రోజు ఉదయం సునందా తనతో ట్విట్టర్‌లో చాట్ చేస్తూ, తాను కొన్ని నిజాలు బయటపెట్టాలా అని అడిగిందని, దానికి తాను "తప్పకుండా ముందుకెళ్లి నిజాలు వెల్లడించు" అని చెప్పానని అన్నారు. అయితే తాను ఆమెను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అలాగే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కూడా అర్థరాత్రి ఫోన్ చేసి కొచ్చి ఒప్పందంపై వెంటనే సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారని, తాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 'అధ్యక్షుడి ఒత్తిడి మేరకే తాను బలవంతంగా సంతకం చేస్తున్నట్లు' ఆ అధికారిక పత్రంపై రాసి మరీ సంతకం చేశానని లలిత్ మోదీ వెల్లడించారు.

నా భార్య ప్రాణం కోసం ఆ రోజు 'సుష్మా స్వరాజ్' కార్డు వాడాను..
భారత చట్టాల నుంచి తప్పించుకునేందుకు తాను రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే లేదా కేంద్ర పాలకుల సహాయం తీసుకున్నాననే ఆరోపణలను లలిత్ మోదీ పూర్తిగా తోసిపుచ్చారు. అయితే తన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క వ్యక్తిగత, మానవీయ సంఘటనను ఆయన ఎమోషనల్‌గా ప్రస్తావించారు. తన పాస్‌పోర్ట్ రద్దయిన సమయంలో అప్పటి కేంద్ర విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ తనకు పోర్చుగల్ వెళ్లడానికి అత్యవసర ప్రయాణ పత్రాలను సమకూర్చడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. "అది నా భార్య మరణ సమయం.. ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతోంది. కుటుంబం విషయానికి వస్తే, నా భార్య శస్త్రచికిత్స పొందుతున్నప్పుడు ఆమె పక్కన ఉండటానికి నాకున్న ప్రతి కార్డును, ప్రతి ఇన్ఫ్లుయెన్స్‌ను నేను వాడతాను. ఆ కార్డే సుష్మా స్వరాజ్. నా భార్య ప్రాణం కోసం నా జీవితంలో ఉన్న ఏకైక అవకాశాన్ని నేను ఆ రోజు ఉపయోగించుకున్నాను" అంటూ లలిత్ మోదీ ఇంటర్వ్యూ ముగింపులో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+