విడాకులు లేవు.. రెండో పెళ్లికి ఛాన్స్ లేదు!: ఉద్యోగులకు బిగ్ షాక్!
తమ మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా మరో మహిళను రెండో పెళ్లి చేసుకునే లేదా ఆమెతో కలిసి జీవించే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగుల జీతం నుంచి 20 శాతం కోత విధించి మొదటి భార్య బ్యాంకు ఖాతాలో జమ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు భార్య ఆర్థిక సాయం కోసం వేచి చూసే పరిస్థితి రాకూడదనే ఇలా చేస్తుమన్నాని పేర్కొన్నారు.
ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మొదటి భార్యకు న్యాయబద్ధమైన విడాకులు ఇవ్వకుండానే వదిలేసి.. ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుంటున్నారనే ఫిర్యాదులు పెరగడంతో అస్సా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బాధిత మహిళలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి వారి జీవనోపాధి కోసం ఈ 20 శాతం మొత్తాన్ని నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తారని సీఎం తెలిపారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ.. తుది తీర్పు వచ్చేవరకు మొదటి భార్య ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ ఆర్థిక సహాయం కొనసాగుతుందని వివరించారు.

అంతే కాకుండా సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన సదరు ఉద్యోగులపై చట్టపరమైన విభాగాలు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహుభార్యత్వానికి వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వం ఇప్పటికే కఠిన చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవడంపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి.
కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన ఉద్యోగుల విషయంలో కూడా ఇలాంటి రక్షణ కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేట్ ఉద్యోగుల భార్యలకు కూడా ఈ తరహా ఆర్థిక రక్షణ కల్పించేలా త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా వదిలేసి ఆమెను ఆర్థిక కష్టాల్లోకి నెట్టే ధోరణికి అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.













Click it and Unblock the Notifications