మళ్లీ వర్షాలు! ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం..
సాధారణంగా ఆకాశంలో మబ్బులు కమ్మడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, సరిగ్గా ఇటువంటి మేఘాలే అంతరిక్షం నుంచి చూస్తే ఓ హైవే కనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి అద్భుత దృశ్యమే ఇప్పుడు ఆసియా ఖండంలో ఆవిష్కృతమైంది. మన దేశం నుంచి మొదలై చైనా మీదుగా సుదూర జపాన్ వరకు వేలాది కిలోమీటర్ల మేర ఒక భారీ మేఘాల పట్టీ సాగిపోయింది. శాటిలైట్స్ తీసిన తాజా చిత్రాల్లో ఈ అద్భుతం స్పష్టంగా కనిపించడంతో వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఆసియాను చుట్టేసిన భారీ మేఘాల వలయం
ఈ అసాధారణ వాతావరణ మార్పులకు సంబంధించిన చిత్రాలను పరిశీలిస్తే.. తూర్పు, ఈశాన్య భారత్ నుంచి ప్రారంభమైన మేఘాలు.. హిమాలయ ప్రాంతాలు, చైనాను దాటుకుంటూ కొరియా ద్వీపకల్పం, జపాన్ వరకు ఒక పెద్ద దారిలా అల్లుకుపోయాయి. ముఖ్యంగా బంగాళాఖాతం, తూర్పు భారతదేశంపై దట్టమైన తేమతో కూడిన గాలి ప్రవహిస్తుండటంతో ఈ భారీ మేఘాలు ఏర్పడ్డాయి. అటు తైవాన్‌కు తూర్పున పశ్చిమ పసిఫిక్ సముద్రంపై మరో సుడిగుండం ఆకారంలో మేఘాలు కమ్ముకోవడం విశేషం. ఇవన్నీ ఆసియా వ్యాప్తంగా భారీగా కదులుతున్న తేమ ప్రవాహానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

భారత్‌లో మళ్లీ జోరుగా వర్షాలు..
ఇది కేవలం అందమైన దృశ్యమే కాదు, మన దేశంలో మళ్లీ వర్షాలు పడటానికి ప్రధాన కారణం కూడా. ఒకవైపు రుతుపవనాలు వెనక్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, మధ్య భారతదేశంపై ఏర్పడిన అల్పపీడనం వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా కదులుతున్న ఈ వాతావరణ వ్యవస్థ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
కొండ ప్రాంతాలకు హెచ్చరిక.. తుది అంకానికి రుతుపవనాలు
ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పశ్చిమ ద్రోణి ప్రభావం కూడా తోడవడంతో హిమాలయ పాద ప్రాంతాల్లో వానలు మరింత ఉధృతమయ్యేలా కనిపిస్తున్నాయి. దీనివల్ల కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించే ముందు.. ఉత్తర భారతదేశంలో కురిసే చివరి భారీ వర్షాల రౌండ్ ఇదే కావచ్చని అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications
