హైదరాబాద్: మహబూబ్‌నగర్ ఫలితాన్ని తాము ఊహించలేకపోయామని, ఒక రకంగా ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్‌నగర్‌లో ఆ పార్టీ ఓడిపోవడం ఆశ్చర్యకరమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చివరి నిమిషంలో మహబూబ్ నగర్ ఫలితం మారిపోయిందని ఆయన అన్నారు. మతపరమైన భావనను రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. ప్రాంతీయవాదం కన్నా మతవాదం ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రాంతీయవాదం వల్ల ఘర్షణలు జరగవని, మతవాదం వల్ల జరుగుతాయని ఆయన అన్నారు.
బిజెపి బలపడడం కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందికరమేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 15 - 16 శాతం ఓట్లు మహబూబ్‌నగర్‌లో బిజెపికి పడ్డాయని, తెరాసకు పది శాతం హిందువుల ఓట్లు కూడా పడలేదని, తెరాస మైనారిటీని నిలబెట్టడం వల్ల బిజెపికి లాభం జరిగిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలవడం దురదృష్టకర పరిణామమని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేసినా 24 - 25 శాతం ఓట్లు సాధించిందని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్‌లో తెరాస గెలుస్తుందని లగడపాటి చేయించిన సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే.