చిక్కుల్లో కిరణ్: డిఎల్ బాటలో మరి కొందరు మంత్రులు?

డిఎల్ రవీంద్రా రెడ్డి బాటలో మరి కొంత మంది మంత్రులు ప్రయాణం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి పట్ల సీనియర్ మంత్రులు కొందరు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. తమను సంప్రదించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వారు చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దామోదర రాజనర్సింహతో దళిత మంత్రులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి తీరుపై నిరసన వ్యక్తం చేయడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి వారు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల్లో గతంలో వచ్చిన ఓట్ల కన్నా చాలా తక్కువ ఓట్లు వచ్చాయని, కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి వల్లనే ఇది జరిగిందని కొంత మంది విమర్శిస్తున్నారు. వి. హనుమంతరావు వంటి సీనియర్ నేతలు ఇది వరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స వ్యవహార శైలిపై సలహాల రూపంలో విమర్శలు చేశారు. సీనియర్లను కలుపుకుని వెళ్లాలని వారు సూచించారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదనే మాట వినిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గాలు పరిస్థితిని అధిష్టానానికి వివరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.