హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాల్సిందేనని మాజీ మంత్రి పి. శంకరరావు అన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు ఆఫీసు బియరర్లంతా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలకు నా వద్ద జాదూ ఉందా అని అన్నటువంటి నాయకుడు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తన అద్భుత దీపమేమీ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఫలితాలపై అనడాన్ని ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.
బొత్స సత్యనారాయణపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. ఫలితాలకు సత్తిబాబు నత్తిబాబు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కోవూరులో కాంగ్రెసు 35 శాతం ఓట్లు వస్తే ఇప్పుడు చాలా తగ్గిందని ఆయన అన్నారు. పలు వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రజల్లో తిరుగుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తిరగడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అరెస్టుపై మీడియా ప్రతినిధుల ప్రశ్నించగా కోర్టులు, చట్టం తమ పని తాము చేసుకుంటూ పోతాయని ఆయన అన్నారు.