ఖమ్మం: భద్రాద్రి శ్రీరామచంద్రుడికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల కల్యాణం జరుగుతున్న మిథిలా మైదానానికి సిఎం చేరుకొని వాటిని సమర్పించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి కిటకిటలాడింది. మిథిల కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు.
సిఎం సతీసమేతంగా కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి భద్రాచలం చేరుకున్న కిరణ్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో మంత్రులు సి.రామచంద్రయ్య, బాలరాజు, పొన్నాల లక్ష్మయ్య, సునీతా రెడ్డి, రాంరెడ్డి వెంకట రెడ్డి, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాముడికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కనుమూరి బాపిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు.