చంద్రబాబు గతే కిరణ్‌కు: ఛార్జీల పెంపుపై ఈటెల, అరెస్ట్

విద్యుత్ సౌధ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెరాస ఆందోళనతో ఖైరతాబాద్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఆందోళన సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఫాలో అవుతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే బాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కాంగ్రెసు ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందన్నారు.
వరంగల్ జిల్లాలో తెరాస శాసన సభ్యుడు వినయ భాస్కర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications