చైనాకు కేంద్రం బిగ్ చెక్- అనూహ్య ఎత్తుగడ
భారత సరిహద్దుల్లో దుశ్చర్యలకు పాల్పడుతున్న చైనాకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మకమైన 27 ప్రాంతాలు, భౌగోళిక గుర్తులను మ్యాపింగ్ చేసింది. వాటిన్నింటినీ తన అధికారిక మ్యాప్‌లలో స్పష్టంగా నమోదు చేసింది. ఈ మేరకు సర్వే ఆఫ్ ఇండియా తాజా మ్యాప్ ను విడుదల చేసింది. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న ఈ ఈశాన్య రాష్ట్రంలోని వివాదాస్పద ప్రాంతాలపై తన వైఖరిని తేల్చి చెప్పింది.
అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని ఆయా వివాదాస్పద ప్రాంతాలను తనవిగా చెప్పుకొంటూ వాటి పేర్లను మార్చుతూ వస్తోన్న చైనాకు చెక్ పెట్టింది కేంద్రం. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించిన తర్వాతే ఈ 27 ప్రాంతాల అధికారిక మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రాంతాల ఖచ్చితమైన భౌగోళిక ఉనికి, వాటి సరిహద్దులను గుర్తించడం, అవన్నీ కూడా భారత్ కు చెందినవే అనే విషయంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించడం దీని ముఖ్య ఉద్దేశం.

కేంద్రం తాజాగా మ్యాపింగ్ చేసిన ప్రాంతాల్లో చారిత్రక ప్రాధాన్యత ఉన్న అనేక సరిహద్దు గ్రామాలు, పర్వాతలు, వాటి గుండా ప్రవహించే నదులు, అక్కడి సరస్సులు ఉన్నాయి. 1959లో భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారిన వాస్తవాధీన రేఖ సమీపంలోని లాంగ్ఝు అనే వ్యూహాత్మక ప్రాంతాన్ని కూడా ఈ మ్యాప్ చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాటు 1962 యుద్ధానికి సంబంధించిన థగ్ లా ప్రాంతాన్ని కూడా ఇందులో పొందుపర్చారు.
తవాంగ్ లో ఉన్న అమర జవాన్ జస్వంత్ సింగ్ రావత్ స్మారక చిహ్నం, ఆయన పేరు మీద వెలిసిన జస్వంత్ గఢ్, చారిత్రక నేపథ్యం ఉన్న షేర్- ఎ- థాపా మెమోరియల్ ను కూడా సర్వే ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించింది. అవన్నీ కూడా తమవేనని తేల్చి చెప్పింది. సరిహద్దులకు సైనిక బలగాలు, సామాగ్రిని తరలించడంలో కీలక పాత్ర పోషించే ఛాంగ్ లాంగ్ జిల్లాలోని జైరామ్ పూర్ టౌన్ కూడా ఇందులో ఉంది. చైనా సరిహద్దుల్లో రక్షణపరంగా అత్యంత సున్నితమైన జో లా పర్వతం కూడా తాజా మ్యాపింగ్ కనిపించింది.
2017, 2021, 2023లో అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను మార్చుతూ మ్యాప్ లను విడుదల చేసింది చైనా. దీన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది కేంద్రం. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. భారత్ లో అరుణాచల్ ప్రదేశ్ విడదీయరాని అంతర్భాగమని, దీనికి సంబంధించి చైనా ఎటువంటి చర్యలు తీసుకున్నా వాటిని దురాక్రమణగానే చూస్తామనీ అప్పట్లో హెచ్చరించింది. తాజాగా అధికారికంగా ఆయా ప్రాంతాలను మ్యాపింగ్ చేయడం చర్చనీయాంశమైంది.





Click it and Unblock the Notifications