ఒకే ఉద్యోగి.. రెండు చోట్ల జీతాలు - ప్రభుత్వ శాఖల్లో మాయాజాలం, గుట్టు రట్టు..!!
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు ఉద్యోగు లు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు చూపి రెండు జీతాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ఒకే ఆధార్ నంబర్ తో రెండు సంస్థల నుంచి జీతాలు తీసుకుంటున్న అక్రమార్కులను ఆర్థికశాఖ గుర్తించింది. పలువురు రెగ్యులర్ ఉద్యోగులు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు మోసగించి, వేతనాలు పొందుతున్నట్లుగా నిర్దారించారు. వీరి పైన కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.
తెలంగాణ ఆర్దిక శాఖ ఉద్యోగుల ముసుగులోని అక్రమార్కులను గుర్తించింది. ఒకే ఉద్యోగి రెండు శాఖల్లో పని చేస్తున్నట్లుగా రెండు చోట్ల వేతనం తీసుకుంటున్నారు. ఒకే ఆధార్ కార్డు నెంబర్ తో వేర్వేరు పేర్లతో ఇలా వేతనాలు అందుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులేనని.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరు రూ.లక్షన్నర నుంచి రూ.5 లక్షల వరకు వేతనాల కింద తీసుకున్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ లో నమోదైన ఉద్యోగుల ఆధార్, ఉద్యోగ వివరాలను సమగ్రంగా ధ్రువీకరించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఉద్యోగుల ఆధార్ వివరాలు, రికార్డులు, వేతన చెల్లింపులను పరిశీలించి నివేదించాలని సూచించింది. రెండు చోట్ల వేతనాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వం సీరియస్.. చర్యలకు అదేశం
కాగా, ఈ వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు.. ఉద్యోగులే ఉద్దేశ పూర్వకంగా మోసానికి పాల్పడ్డారా... ఏదైనా సాంకేతిక తప్పదం ఉందా అనే సందేహాలు ప్రభుత్వ వర్గాల్లో మొదలయ్యాయి. ఒకే ఆధార్ మీద ఒకచోట పురుషుడిగా, మరోచోట మహిళగా.. ఇంకొన్ని కేసుల్లో ఒకే ఆధార్ మీద రెండు వేర్వేరు మతాల పేర్లతో ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నట్టు వెల్లడైంది. వారంతా రెగ్యులర్ ఉద్యోగులే, 010 పద్దు కింద జీతాలు తీసుకుంటున్న వారుగా గుర్తించారు. వీరు పోలీసు, రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్, ప్రజారోగ్య శాఖల్లో ఎక్కువగా ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని సీఎస్ సంజయ్‌జాజు తీవ్రంగా పరిగణించారు. ఒకటి కంటే ఎక్కువ జీతాలు తీసుకున్నట్లు గుర్తిస్తే.. తెలంగాణ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది.



Click it and Unblock the Notifications