వాస్తు ప్రకారం.. ఇంట్లో అరటి మొక్క, వృక్ష వేధ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
హిందూ సంప్రదాయంలో కొన్ని రకాల పవిత్ర మొక్కలను ఇంట్లో పెంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. వాటిలో అరటి మొక్కకు అత్యున్నత స్థానం ఉంది. లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుల అనుగ్రహంతో ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలనే ఉద్దేశంతో చాలా మంది తమ ఇళ్ల ఆవరణలో అరటి మొక్కలను నాటుతుంటారు. వాస్తు ప్రకారం ఈ పవిత్రమైన మొక్కను సరైన దిశ, సరైన పద్ధతిలో నాటితేనే దాని ఫలితాలు అందుతాయి. లేకపోతే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.
దేవతల గురువు బృహస్పతితో అరటి చెట్టుకు బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. బృహస్పతి సాక్షాత్తు విష్ణువుతో సమానమని నమ్ముతారు. అందుకే పూజల్లో అరటి, అరిటాకు, అరటి గెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రతీ పండుగ, విశేష సందర్భాల్లో అరటి ఆకులతో గుమ్మాలను అలంకరించడం, అరిటాకులో భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా లేకపోలేదు.

వాస్తు శాస్త్రం ప్రకారం అరటి మొక్కను ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో నాటడం అత్యంత శుభప్రదం. ప్రత్యేకించి.. ఈశాన్య దిక్కు దేవతలు, బృహస్పతికి నిర్దేశించిన స్థానం కావడం వల్ల ఈ దిశలో అరటి మొక్కను నాటి, నిత్యం పూజించడం వల్ల ఆ ఇల్లు ఐశ్వర్యంతో తులతూగుతుంది. ఇంట్లో తగినంత స్థలం లేరపోతే టెర్రస్ పై పెద్ద కుండీల్లో కూడా దీన్ని దీనిని సులభంగా పెంచుకోవచ్చు. భక్తితో మాత్రమే దీన్ని పెంచాలి. ఇంటి అందం కోసం దీనిని ఎక్కడపడితే అక్కడ నాటడం మంచిది కాదు. ముఖ్యంగా ఇంటి పరిసరాలలో అరటి చెట్టును ఉంచే స్థానం, దిశపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.
అరటి చెట్టును ఎక్కడపడితే అక్కడ నాటకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా అరటి మొక్కను అస్సలు నాటకూడదు. ఇది వృక్ష వేధకు దారితీస్తుంది. ఇంట్లో జరగాల్సిన శుభ కార్యాలకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తుంది. అగ్ని తత్వం ఉన్న ఆగ్నేయ దిశగా కూడా దీనిని పెంచకూడదు. అరటి మొక్కకు నిత్యం అధిక నీరు అవసరం. ఆగ్నేయ దిశలో నీటి నిల్వలు ఉండటం వాస్తు ప్రకారం తీవ్రమైన దోషం కావడం వల్ల ఆ దిశలో దీన్ని పెంచకూడదు.
ఇంట్లో సానుకూల శక్తులను మరింత పెంచడానికి అరటి మొక్క పక్కనే తులసి మొక్కను కూడా నాటాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అరటిలో మహావిష్ణువు, తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. ఈ రెండింటినీ పక్కపక్కనే ఉంచడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగుతుందని విశ్వసిస్తారు. ఉదయం నిద్రలేవగానే అరటి చెట్టు కంటికి నేరుగా కనిపించని రీతిలో ఉండేలా చూసుకోవడం మంచిది.
సనాతన ధర్మంలో అరటి మొక్కకు ఉన్న విశిష్టత కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో దీనిని పెంచడానికి ఇష్టపడతారు. ఈ మొక్కను నాటడం వరకే కాదు.. పచ్చగా ఉంచడం ముఖ్యం. ఎండిపోయిన లేదా నీరు లేక వాడిపోయిన అరటి మొక్కలు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో వాస్తు నియమాలను అనుసరించి మొక్కలను నాటడం వల్ల సుఖశాంతులు వెల్లివిరుస్తాయనే నమ్మకం ఉంది.




Click it and Unblock the Notifications