వైయస్ జగన్ అరెస్టుపై మారిన సిబిఐ వ్యూహం?

తాము దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్లలో జగన్‌ను తొలి నిందితుడిగా చేరుస్తామని సిబిఐ వర్గాలు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా జగన్ అరెస్టుపై నిర్ణయం వెలువరించాలని సిబిఐ ప్రత్యేక కోర్టును కోరే అవకాశం ఉందని అంటున్నారు. సిబిఐ దర్యాప్తు, ప్రాసిక్యూటింగ్ సంస్థ అని, నిందితులను అరెస్టు చేసి ఆరోపణలను కోర్టులో రుజువు చేయాల్సిన పని సిబిఐదేనని, కేవలం జగన్ కేసులోనే సిబిఐ కోర్టుకు విన్నవించుకుని కోర్టు ఆదేశాల కోసం చూస్తోందని న్యాయనిపుణులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణకు, ఆయన కుటుంబ సభ్యులకు జగన్ వర్గం నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు చెబుతున్నారు. దీంతో లక్ష్మినారాయణకు వై కెటగిరీ కింద భద్రత కల్పించారు. కాగా, జగన్ కేసులో సిబిఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)పై ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్ కేసులో పేర్కొన్న కంపెనీలకు సంబంధించి మనీలాండరింగ్ కింద ఈడి బృందాలు రెండు మార్షియస్, స్విట్జర్లాండ్, ఇస్లే ఆఫ్ మ్యాన్, సింగపూర్, మలేసియా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ పర్యటించి ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తాము సేకరించిన ఆధారాలతో ఈ నెలాఖరులోగా ఈడి జగన్‌కు సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మనీ లాండరింగ్ విషయంలోనే తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఈడి జగన్‌కు సమన్లు జారీ చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సిబిఐ జగన్ కేసులో చార్జిషీట్లు దాఖలు చేస్తుందని చెబుతున్నారు. కోర్టు నుంచి అరెస్టు వారంట్ పొందడం ఒకవైపు, తనంత తానుగా జగన్ లొంగిపోయే విధంగా ఒత్తిడి తేవడం మరో వైపు అనే వ్యూహాలను సిబిఐ అనుసరించే అవకాశం ఉందని అంటున్నారు.