అంబేడ్కర్ విగ్రహానికి అవమానం, విరిగిన చేయి

హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో కలిసి వచ్చారు. ఫూలే బాటలో నడిచి, సామాజిక న్యాయం కావాలని అంబేడ్కర్ చెప్పారని, అందుకు చట్టబద్దమైన ఏర్పాట్లకు కూడా కృషి చేశారని చిరంజీవి అన్నారు.
శాసనసభ ఆవరణల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్థల సేకరణ కోసం పరిశీలన జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సామాజిక మార్పునకు అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాత అని ఆయన అన్నారు. బడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు విషయంపై వివాదం తలెత్తింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రార్థనా స్థలం వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విగ్రహాన్ని తొలగించారు.
హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రాహానికి నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని మాల మహానాడు కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలా ప్రకటన చేయని ముఖ్యమంత్రి అంబేడ్కర్‌కు నివాళులు అర్పించేందుకు అనర్హుడని వారన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications