వారికి 5వేలు బహుమతి... ఏపీ ప్రభుత్వం గిఫ్ట్ ఎవరికంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనాభా నిర్వహణ కోసం మరియు ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించటం కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ జనాభా దినోత్సవం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఇందులో భాగంగా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు, ప్రసవాలు మధ్య తగిన వ్యవధి పాటించిన దంపతులకు నగదు బహుమతులను అందించాలని నిర్ణయించింది.
జులై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జులై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం.. మన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అన్న నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగింది.

84 మంది దంపతులకు ఒక్కొక్కరికి 5000రూపాయల చొప్పున నగదు
ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలని కన్న తల్లిదండ్రులు ముగ్గురు దంపతులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5000రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాలలో మొత్తం 84 దంపతులు ఈ ప్రయోజనాన్ని పొందనున్నారు. అర్హులు ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేస్తారు.
ప్రసవాల మధ్య గ్యాప్ పాటించిన వారికి 5 వేల రూపాయల నగదు
ప్రసవాల మధ్య కనీసం రెండు సంవత్సరాల విరామం పాటించిన దంపతులను కూడా ప్రభుత్వం 5 వేల రూపాయల నగదు బహుమతితో ప్రోత్సహిస్తుంది. ప్రతీ జిల్లాలో ఆరుగురు దంపతులకు 5వేల రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు. వైద్య నిపుణుల ప్రకారం ఈ వ్యవధి తల్లి-బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మాతృ మరణాలు సుమారు 30 శాతం, శిశు మరణాలు 10 శాతం తగ్గే అవకాశం ఉంది.
జనాభా నిర్వహణపై విస్తృత ప్రచారం
అంతేకాదు యుక్త వయసులో ఉన్నవారు గర్భ ధారణలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గర్భనిరోధక పద్ధతులు, అంతరా ఇంజెక్షన్ వంటి సమాచారం మహిళలకు అందించనున్నారు. పంచాయతీరాజ్, పురపాలక సంస్థలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు తదితరులను భాగస్వామ్యం చేసుకొని విస్తృత ప్రచారం చేయనున్నారు.
వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు
ఈ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.56 లక్షలు కేటాయించింది. ఇక ఈ కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు ఇవ్వనున్నారు. అయితే ఈ నగదు ప్రోత్సాహకాలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మాత్రమే ఒక్కసారి అమలు చేసే కార్యక్రమమని అధికారులు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications