TRS పేరు పై ఈసీ నిర్ణయం వేళ హైకోర్టు కీలక ఆదేశాలు..!!
కల్వకుంట్ల కవిత స్థాపించిన టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సమితి) పార్టీపై అభ్యంతరం ఎపిసోడ్ కొత్త మలుపు తీసుకుంది. ఈ పేరు పైన బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది. దీంతో, ఈసీ తెలంగాణ రక్షణ సమితి బదులు మరో పేరు తీసుకోవాలని ఇటీవల లేఖ రాసింది. దీని పైన కవిత కోర్టును ఆశ్రయించారు. దీంతో.. కోర్టు తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది.
కవిత కొత్తగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో, ఈ పేరు కొనసాగింపు పైన ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. అభ్యంతరాలు పెద్ద సంఖ్య లో రావటంతో.. ఈ పేరు కొనసాగించలేమని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా ఇతర పేర్లు ఎంపిక చేయాలని సూచించింది. కవిత తమ పార్టీ పేరు ఖరారు సమయంలోనే ప్రకటన ఇచ్చామని.. అప్పుడు వచ్చిన అభ్యంతరాలకు సమాధానం కూడా ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. ఈసీకి వచ్చిన అభ్యంతరాల పైన స్పష్టత ఇస్తే సమాధానాలు ఇస్తామని పేర్కొన్నారు. ఇదే అంశం పైన కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పైన కోర్టు స్పందించింది. తాము ఈ పిటీషన్ విచారణకు స్వీకరిస్తే ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోవటమేనని పేర్కొంది.

కోర్టు తాజా ఆదేశాలతో
ఇదే సమయంలో టీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్‌పై తీవ్రమైన అభ్యంతరాలు వచ్చిన అంశాన్ని కోర్టు గుర్తు చేసింది. కాగా.. అభ్యంతరాలు తమకు ఇవ్వలేదని.. వ్యక్తిగత వాదనలకు అవకాశం ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు. అయితే, తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్ అనేది ఒకే పేరుగా కనిపిస్తుందని ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, తెలంగాణ రక్షణ సమితి పేరు టీఆర్‌ఎస్‌కు అర్థం వచ్చేలా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈసీ నోటీసులకు జవాబిచ్చేందుకు కవితకు వారం రోజుల గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని, ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు న్యాయస్థానం సూచన చేసినట్లు సమాచారం.













Click it and Unblock the Notifications