కడియం శ్రీహరి పై హైకమాండ్ కు కొండా సురేఖ ఫిర్యాదు..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో కొండా సురేఖ పైన చర్చ జరిగింది. ఇప్పుడు కొత్తగా మరో సారి కొండా సురేఖకు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా కడియం శ్రీహరి నిర్వహించిన రివ్యూ పైన ఆగ్రహంతో ఉన్న సురేఖ నేరుగా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసారు.
వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య కొత్త పంచాయితీ మొదలైంది. మంత్రి సురేఖకు తెలియకుండానే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడియంపై నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని రాష్ట్ర నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఈ ఇద్దరి నేతల మధ్య పొలిటికల్ వార్ నడిచింది. అయితే, అప్పట్లో పార్టీ ముఖ్య నేతల జోక్యంతో ఆ వ్యవహారం కొంత సైలెంట్ అయింది. తిరిగి, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెర పైకి వచ్చింది. పార్టీ నేతలకు ఈ వ్యవహారం సమస్యగా మారుతోంది.

నేరుగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు
తన నియోజకవర్గం.. తాను పర్యవేక్షిస్తున్న శాఖలోని వ్యవహారాల పైన కడియం శ్రీహరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను కనీసం సంప్రదించకుండా, ఆమెకు సమాచారం ఇవ్వకుండానే కడియం శ్రీహరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా.. స్టేషన్ ఘన్‌పూర్ లోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను నేరుగా ఆదేశించడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకంలో తనను పూర్తిగా పక్కనబెట్టడం కొండా సురేఖ ఆగ్రహం తో ఉన్నారు. ఇప్పుడు కడియం వ్యవహారం పైన మండిపడుతున్నారు. దీంతో.. కొండా సురేఖ తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications