కవిత ఎఫెక్ట్: అంబేడ్కర్ విగ్రహంపై బొత్స, మల్లు ప్రకటన

శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంపై శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం విడివిడిగా ప్రకటనలు చేశారు. శానససభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. శానససభ ఆవరణలో ఎక్కడ విగ్రహాన్ని నెలకొల్పాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శాసనసభ ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు. హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ వద్గ గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు స్థల పరిశీలన జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై శానససభలోనూ మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించినట్లు ఆయన తెలిపారు.
శాసనసభ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కవిత గత కొంత కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి ఆ విషయంపై వినతిపత్రం కూడా సమర్పించారు. అయితే, కవిత తీరును మాల మహానాడు నాయకుడు కారెం శివాజీ తప్పు పట్టారు. తెలంగాణ కోసం పోరాడుతున్న కవిత అంబేడ్కర్ విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ఆవరణలో పెట్టమంటారా, సమైక్యాంధ్ర శాసనసభ ఆవరణలో పెట్టమంటారా అని ఆయన శనివారం అడిగారు.












Click it and Unblock the Notifications