జగన్‌తో లింక్స్ ముద్రను చెరిపేందుకు తెరాస పాట్లు

పరకాలలో అటు బిజెపిని, ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖను ఓడించి, తెలంగాణవాదానికి తామే నిర్దేశకులమని, తమనే ప్రజలు తెలంగాణవాదులుగా గుర్తిస్తున్నారని చాటుకోవడానికి తెరాస తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి తమకు సవాల్ విసురుతున్న నేపథ్యంలో తెరాసకు ఆ అవసరం ఏర్పడింది. పైగా, జగన్‌తో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రహస్య అవగాహనకు వచ్చారని, అందుకే వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ భూములను ఇతరులకు కట్టబెట్టిన వైనంపై మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి వంటి తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు.
వైయస్ జగన్‌తో తమకు సంబంధం లేదని, ఇతర సమైక్యాంధ్ర నాయకులను చూసినట్లే వైయస్ జగన్‌ను చూస్తున్నామని చెప్పుకోవడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తాజాగా తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు చేసిన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాన్ని ప్రయోగశాలగా మార్చి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి భూములను పూర్తిగా దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాపాల పుట్ట పగిలి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో జగన్ పార్టీకి స్థానం లేదని పరకాలలో జరిగే ఉప ఎన్నిక ద్వారా నిరూపిస్తామని ఆయన చెప్పారు. కొండా సురేఖ జెఏసి అంటే జగన్ యాక్షన్ కమిటీ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు.
ఇంతకు ముందు హరీష్ రావు కూడా వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. వైయస్ జగన్‌ను కూడా సమైక్యవాదిగానే చూస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌లకు వైయస్ జగన్‌కు తేడా లేదని, వారందరినీ తాము ఒకే రకంగా చూస్తున్నామని ఆయన చెప్పారు. పరకాల ఉప ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ తెరాస నాయకులు వైయస్ జగన్‌పై విమర్శలను పెంచే పరిస్థితి కూడా ఉంది.












Click it and Unblock the Notifications