హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనాడు, జ్యోతిపై జగన్‌పార్టీ దాడి: సాక్షి సత్తా చూపిస్తాం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha-Shobha Nagi Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్ ఫ్రా బ్యాంకు ఖాతాల స్తంభనపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. బుధవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పైన, తెలుగుదేశం, కాంగ్రెసు, సిబిఐ పైన నిప్పులు చెరిగారు.

సాక్షి పత్రిక నిషేధిత సంస్థ కాదని, చట్ట వ్యతిరేక పత్రిక కాదని ఎందుకు ఖాతాలను స్తంభింప చేశారని ఆమె సిబిఐని ప్రశ్నించారు. తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన పత్రికను మూసివేయాలని ప్రయత్నం జరిగితోందని ఆమె ఆరోపించారు. జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో రోజుకో తప్పుడు కథనం వస్తుందన్నారు. సాక్షి పత్రిక చదువవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.

ఈ తరహా చర్యలు ఏమర్జెన్సీలోనూ చోటు చేసుకోలేదని, రాజకీయంగా జగన్‌ను ఎదుర్కోలేకే ఎలాంటి దాడులు చేస్తున్నారన్నారు. మీడియాలో ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె ఈనాడు, ఆంధ్రజ్యోతిలను ఉద్దేశించి అన్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తుందంటూ ఖండించాల్సింది పోయి నాజీల మాదిరిగా సదరు మీడియా ప్రవర్తిస్తోందన్నారు. జగన్ పైన ద్వేషంతో ఓ వర్గం మీడియా కాంగ్రెసు, టిడిపిలు కుళ్లు రాజకీయం చేస్తున్నాయన్నారు.

తాము ఇప్పటి వరకు ప్రజలకు ఇలా చెప్పలేదని, ఇక నుండి చెబుతామని అంటూ.. ఇక నుండి సాక్షిని మాత్రమే చదవండని, సాక్షిని మాత్రమే చూడండని ఆమె పిలుపునిచ్చారు. బాబు తనకు మీడియా అండ లేదంటున్నారని, కానీ ఈ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదే అన్నారు. బాబు తోక పత్రికలు సాక్షి అతి తక్కువ కాలంలో అత్యధిక సర్క్యూలేషన్ స్థాయికి ఎలా ఎదిగిందో ఆలోచించాలన్నారు. ఇది ఆంధ్రా ప్రజల విజయమని అన్నారు.

కాంగ్రెసు, టిడిపిలు కలిసి జగన్‌ను ఇబ్బందుల పాలు చేయడాన్ని, ఓ వర్గం మీడియా సాక్షి బ్యాంకు ఖాతాలని స్తంభింపజేస్తే సంతోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సాక్షిని ప్రజలు కాపాడుకుంటారన్నారు. ఖాతాల స్తంభనను జర్నలిస్టులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు ఎల్లో పత్రికలు తాము చెప్పిందే నిజమని ప్రజలను నమ్మించాయని, సాక్షి మాత్రం రెండో వైపు కోణాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్తోందన్నారు.

కోటిన్నర మందిని సాక్షిని చదువుతున్నారన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజలు సాక్షిని రక్షించుకుంటారన్నారు. రూపాయి లేకుండా సాక్షిని మూసివేయాలని చూస్తే కోట్లాది రూపాయలు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు నడుపుకునే పత్రికను ఇక చూపిస్తామన్నారు. ఎల్లో మీడియా ప్రజలకు సరైన సమాచారం అందివ్వలేక పోయిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఈనాడును ఏనాడు వ్యతిరేకించలేదన్నారు.

సాక్షి పైన జరుగుతున్న దాడి మరే ఇతర మీడియా పైన జరగలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, సాక్షి ఉద్యోగులను, ప్రజలను ఆందోళనకు గురి చేసేందుకే సిబిఐ కోర్టు జగన్‌కు నోటీసులు జారీ చేసిందన్నారు. సిబిఐ గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. కోర్టు పిలిస్తే వెళ్లి సమాధానం చెబుతారని అన్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో అన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, సిబిఐని అడ్డుపెట్టుకొని కాంగ్రెసు పార్టీ జగన్‌ను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ఏ రుజువులు లేకుండానే సాక్షి బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

సాక్షి బ్యాంక్ ఖాతాలపై సిబిఐ పెట్టిన ఆంక్షలను వెంటనే ఎత్తి వేయాలని వరంగల్ జిల్లాలో కొండా సురేఖ డిమాండ్ చేశారు. సిబిఐ తీరు పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందన్నారు. సాక్షిని మూసివేయించేందుకు రామోజీ రావు, చంద్రబాబు, కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయ్యాయని కర్నూలులో శోభా నాగి రెడ్డి ఆరోపించారు. సాక్షి మీడియాను ప్రజలే నడిపిస్తారన్నారు. వైయస్ జగన్‌ను అరెస్టు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

బ్యాంక్ ఖాతాలు మూసివేయడం పత్రికా స్వేచ్ఛపై దాడి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. అకౌంట్లు నిలిపివేయడం సరికాదన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగమన్నారు. ఉద్యోగులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు. కాగా ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పలుచోట్ల ఆందోళనలకు దిగారు.

English summary
YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy party leaders Vasireddy Padma, Sobha Nagi Reddy and Konda Surekha were lashes out at Telugudesam, Congress, Eenadu and Andhrajyothy for freezing bank accounts of Sakshi media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X