పాలమూరు వేరు, పరకాల వేరు: బిజెపిపై విజయశాంతి

మహబూబ్‌నగర్ శాసనసభా నియోజకవర్గం పరిస్థితులు వేరు, పరకాల పరిస్థితులు వేరని, పరకాలలో బిజెపి పోటీ చేయడం సరి కాదని ఆమె అన్నారు. పోటీ నుంచి తప్పుకుని బిజెపి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. పరకాలలో తెలంగాణవాదుల ఓట్లు చీలకుండా ఉండాలంటే తెలంగాణ రాజకీయ జెఎసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలని ఆమె కోరారు. బిజెపి చీల్చే ఓట్లు సమైక్యవాదులకు ఉపయోగపడుతాయని ఆమె అన్నారు.
పరకాలకు తమ పార్టీ అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెసు ప్రభుత్వం రైతులను ఏనాడూ ఆదుకోలేదని ఆయన విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదనని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వర్షాభావంతో రైతులు నష్టపోయారని ఆయన చెప్పారు.
మహబూబ్‌నగర్ శానససభా నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించిన బిజెపి పరకాలలో కూడా పాగా వేయాలని భావిస్తోంది. తనతో పాటు తెలంగాణ కోసం నడుస్తున్న తెరాసను కాదని బిజెపి పరకాలలో అభ్యర్థిని పోటీకి దించడానికి ప్రయత్నిస్తోంది. తెరాసను దెబ్బ తీసి తెలంగాణవాదానికి తాము ప్రాతినిధ్యం వహిస్తామని చాటుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications